: అంతరిక్షయానంలో భారత్ కు మరో విజయం... జీశాట్-16 ప్రయోగం సక్సెస్
అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో విజయం చేరింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు ప్రయోగించిన జీశాట్-16 ప్రయోగం విజయవంతమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రయోగాన్ని ఇస్రో శనివారం రాత్రి ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి దిగ్విజయంగా ప్రయోగించింది. భారత కమ్యూనికేషన్స్ రంగానికి మరింత ఊతమివ్వనున్న జీశాట్-16, అమెరికాలో డైరెక్ట్ టు హోం టెలివిజన్ ప్రసారాలను మెరుగుపరచనున్న డైరెక్ట్ టీవీ-14 ఉపగ్రహాన్ని తనవెంట తీసుకెళ్లింది. జీశాట్-16 కారణంగా భారత్ లో టీవీ, రేడియో ప్రసారాలు మరింత మెరుగు కావడమే కాక టెలిఫోన్ సేవలు కూడా విస్తృతం కానున్నాయి. 12 ఏళ్ల పాటు అంతరిక్షంలో ఉండే జీశాట్-16, ఏప్రిల్ లో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇన్ శాట్-3ఈ స్థానాన్ని భర్తీ చేయనుంది.