: రూ.కోటి వేతనమిచ్చినా కొలువు నచ్చాలిగా: భారీ ఆఫర్ ను తిరస్కరించిన ఐఐటీయన్లు
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాలయాలు ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యను దిగ్విజయంగా ముగించుకోబోతున్న విద్యార్థులకు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ ఏడాది కేంపస్ ఇంటర్వ్యూల్లో రెడ్ కార్పెట్ పరిచాయి. నచ్చిన విద్యార్థులను నియమించుకునేందుకు సదరు కంపెనీలు క్యూ కట్టడమే కాక కోటి రూపాయలకు పైగా వేతనాలను ఆఫర్ చేశాయి. అయితే నలుగురు కాన్పూర్ ఐఐటీ విద్యార్థులను మాత్రం ఆ సంస్థలు ఉద్యోగులుగా చేర్చుకోలేకపోయాయి. అయినా తొలి ఉద్యోగంలోనే కోటి రూపాయలకు పైగా వేతనం లభించే ఉద్యోగాలను ఎందుకు కాదన్నారని ఆ నలుగురిని ప్రశ్నిస్తే, వారు చెప్పే సమాధానంతో కంపెనీల యాజమాన్యాలు షాక్ తిన్నాయట. మీరిచ్చే వేతనం బాగానే ఉంది, మరి మీ కంపెనీలో ఉద్యోగం మాకు నచ్చాలిగా అంటూ ఆ నలుగురు విద్యార్థులు ఆయా కంపెనీలను ముఖం మీదే ప్రశ్నించారట. నచ్చిన ఉద్యోగాల కోసం కోట్లాది రూపాయల వేతనాన్ని వదులుకున్న ఆ నలుగురు విద్యార్థులు తమకు నచ్చిన సంస్థల్లో రూ.50 లక్షల వేతనానికే చేరిపోయారు. ఆ నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఓ ధీర వనిత కూడా ఉంది.