: సీనియర్లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు: గంగూలీ


వరల్డ్ కప్ కు టీమిండియా ప్రాబబుల్స్ ను ప్రకటించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. సీనియర్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నాడు. అసలు, వారిని ఎంపిక చేస్తారన్న ఆలోచనే తనకు కలగలేదని చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్ టూర్ కు ఎంపికైనా, గంభీర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. ప్రాబబుల్స్ గా ఎంపికయ్యేందుకు సెహ్వాగ్, గంభీర్ లకు కొద్దిపాటి అవకాశాలు కూడా లేవని గంగూలీ అన్నాడు. 2012-13 సీజన్ నుంచి సెహ్వాగ్ భారత్ కు ఆడలేదని, మరి అలాంటప్పుడు, అతడిని ప్రాబబుల్స్ లోకి తీసుకుంటారని ఎలా భావిస్తామని ప్రశ్నించాడు. జట్టుకు దూరమైనప్పుడు దేశవాళీ పోటీల్లో రాణించాలని, కానీ, సెహ్వాగ్ అక్కడ కూడా విఫలమయ్యాడని గంగూలీ పేర్కొన్నాడు. అయితే, ప్రతిభ పరంగా తాను సెహ్వాగ్ ను గవాస్కర్ తో పోల్చుతానని, అతను ప్రపంచ అత్యుత్తుమ ఓపెనర్లలో ఒకడని తెలిపాడు. ఇక, జహీర్, హర్భజన్ సింగ్ యువ క్రికెటర్ల హవాలో కొట్టుకుపోయారని వివరించాడు. ఫిట్ నెస్ లేకపోవడం జహీర్ కు ప్రధాన సమస్య అని దాదా అభిప్రాయపడ్డాడు. సురేశ్ రైనా వంటి ఆటగాళ్లు యువరాజ్ సింగ్ అవకాశాలను మృగ్యం చేశారని తెలిపాడు. కానీ, 2003, 2011 వరల్డ్ కప్ లో అతని ప్రదర్శన అమోఘమని కొనియాడాడు. వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు ఆసీస్, ఇంగ్లండ్ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడనుందని, దాంట్లో రాణించిన వాళ్లే వరల్డ్ కప్ తుది జట్టులో ఉంటారని గంగూలీ స్పష్టం చేశాడు. తద్వారా, సీనియర్లకు ఇక ఎలాంటి అవకాశాలు లేనట్టే అని విశ్లేషించాడు.

  • Loading...

More Telugu News