: ఇప్పుడు ప్రజలతో పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు: బాబుపై జగన్ ఫైర్
రుణమాఫీ అంశంపై సర్కారు తీరును నిరసిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని అన్నారు. ఎన్నికల సందర్భంగా మోదీ బొమ్మ పక్కనే తన బొమ్మ పెట్టుకుని ఎన్నో కరపత్రాలు ముద్రించారని, వాటిలో తొలి పాయింటు రైతు రుణమాఫీ అని, రెండో పాయింటు డ్వాక్రా రుణమాఫీ అని తెలిపారు. అదే విధంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ముద్రించిన పోస్టర్లలోనూ ఇదే విధంగా ప్రకటించారని వివరించారు. అంతకుముందు, ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో తాను అన్నీ ఆలోచించాకే ఈ హామీలు ఇచ్చానని చంద్రబాబు పేర్కొన్నారని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. అప్పుడు ప్రజలతో అవసరం ఉన్నందున ఆయన అలా అడ్డగోలు హామీలిచ్చారని విమర్శించారు. ఇప్పుడు వ్యవసాయ రుణాలు మాఫీ చేయమంటే కేవలం పంట రుణాలే మాఫీ చేస్తానని అంటున్నాడని, అటు, డ్వాక్రా రుణమాఫీ అంశంపైనా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నాడని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు కొంత సొమ్ము ఇస్తాం, తీసుకోండంటూ తప్పించుకోజూస్తున్నాడని జగన్ దుయ్యబట్టారు. వ్యవసాయ రుణాల విలువ రూ.87 వేల కోట్లు కాగా, డ్వాక్రా రుణాల విలువ రూ.14 వేల కోట్లు అని వివరించారు. మొత్తం రూ.1.01 లక్ష కోట్లు అని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే, రైతు రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నారని మండిపడ్డారు. కోటి పైచిలుకు ఖాతాలు ఉంటే 20 లక్షల ఖాతాలు మాత్రమే ఉన్నట్టు చూపుతున్నారని ఆరోపించారు. ఇది న్యాయమా? అని ప్రశ్నించారు. బడ్జెట్ లో కేటాయించిన రూ.5000 కోట్లతో 20 శాతం రుణాలు మాఫీ అయిపోతాయని చెబుతున్నారని జగన్ వివరించారు. రుణమాఫీ ఆలస్యం కారణంగా రైతులు 14 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున రుణమాఫీ ఫైలు సంతకం చేయలేదని, ఆయన సంతకం చేసింది కోటయ్య కమిటీ ఫైలుపై అని విమర్శించారు. రుణమాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీ ప్రభుత్వంపై భారం తగ్గించుకోవాలంటూ, పరోక్షంగా రుణమాఫీ వ్యతిరేక నిర్ణయం తెలిపిందని జగన్ తూర్పారబట్టారు. అంతేగాకుండా, బాబు వస్తే జాబు వస్తుంది అంటూ తప్పుడు ప్రచారం చేశారని, రూ.2 వేలు నిరుద్యోగ భత్యం ఇస్తామని, తీరా అధికారంలోకి వచ్చాక మాటమార్చారని విమర్శించారు. ఇప్పుడు ప్రజలతో పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై సర్కారు తీరుకు నిరసనగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని జగన్ వివరించారు.