: టీమిండియా ప్రాబబుల్స్ ఎంపికకు రంగం సిద్ధం
వన్డే వరల్డ్ కప్ కు మరికొన్ని నెలల సమయం ఉండగానే, టీమిండియా ప్రాబబుల్స్ ను ఎంపిక చేయనున్నారు. ముంబయిలో గురువారం సమావేశం కానున్న సెలెక్టర్లు 30 మందితో ప్రాబబుల్స్ ప్రాథమిక జాబితాను ప్రకటిస్తారు. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వివరాలు తెలిపారు. కాగా, గత వరల్డ్ కప్ లో విశేష ప్రతిభ కనబరిచినా, ప్రస్తుతం ఫామ్ లో లేని యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా తదితరులు ప్రాబబుల్స్ ఎంపికపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే, పేస్, బౌన్స్ కు అనుకూలించే ఆసీస్ పిచ్ లపై ప్రభావం చూపగల ఆటగాళ్లనే సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఏదెలాగున్నా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెచ్చిన ఆటగాడే వరల్డ్ కప్ కు ఎంపికవుతాడన్నది బహిరంగ రహస్యం!