: సరితపై దయచూపండి: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి క్రీడా మంత్రి లేఖ
ఆసియా క్రీడల్లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈమేరకు క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి లేఖ రాశారు. ఆమెపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లేఖలో కోరారు. సరిత ప్రతికూల పరిస్థితుల్లోనూ బాక్సింగ్ ను కెరీర్ ఎంచుకున్నదని, కష్టించి పైకెదిగిందని మంత్రి వివరించారు. ఆమెపై దయచూపాలని కోరారు. ఈ సస్పెన్షన్ వ్యవహారం ఇతర క్రీడాకారులపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. భారత్ లో బాక్సింగ్ అభివృద్ధి దృష్ట్యా సరితపై మరే ఇతర కఠిన చర్యలు తీసుకోవద్దని సోనోవాల్ విజ్ఞప్తి చేశారు.