: ‘రాజధాని’ రైతులతో మరోమారు చంద్రబాబు ముఖాముఖి భేటీ
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు పరిసర ప్రాంతాల రైతులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోమారు ముఖాముఖి భేటీ కానున్నారు. ఇప్పటికే ఓ దఫా ఆ ప్రాంత రైతులతో భేటీ నిర్వహించిన చంద్రబాబు, రాజధాని నిర్మాణం కోసం భూములివ్వడం ద్వారా లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. అయితే 'ముందుగా మీ ప్రతిపాదనలు చెప్పండి, మా సమ్మతి తెలియజేస్తా'మంటూ ఆ ప్రాంత రైతులు తమ అభిప్రాయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని నిర్మాణానికి సహకారం అందించేందుకు సింగపూర్ ముందుకు రావడం, నిర్మాణ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు జపాన్ సమ్మతించిన నేపథ్యంలో భూసేకరణను వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ఆ ప్రాంత రైతులతో భేటీ నిర్వహించి వారిలోని అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గురువారం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ సందర్భంగా సరికొత్త ప్రతిపాదనలతో రైతులను ఒప్పించేందుకు ప్రభుత్వం కార్యరంగాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.