: 'ఇసిస్' మాజీ ఉగ్రవాది మాజిద్ ను ప్రశ్నించనున్న అమెరికా?
'ఇసిస్' నుంచి తిరిగివచ్చిన ఉగ్రవాది ఆరిఫ్ మాజిద్ ను అమెరికా నిఘా వర్గాలు ప్రశ్నించనున్నాయి. ఇరాక్, సిరియాలో నరమేధం సృష్టిస్తున్న ఇసిస్ కార్యకలాపాలపై సమగ్ర సమాచారం తెలుసుకునే క్రమంలో మాజిద్ ను ప్రశ్నించేందుకు ఆ దేశ అధికారులు యత్నిస్తున్నట్లు సమాచారం. ఇసిస్ కార్యకలాపాలకు సంబంధించి వాస్తవ స్థితిగతులపై మాజిద్ కు తప్పనిసరిగా అవగాహన ఉంటుందని భావిస్తున్న అమెరికా నిఘా వర్గాలు, సదరు వివరాలను సేకరించేందుకు త్వరలోనే భారత్ కు వచ్చే అవకాశాలున్నాయి. వృత్తి రీత్యా సివిల్ ఇంజినీర్ అయిన ఆరిఫ్ తో ఇసిస్ ఉగ్రవాదులు తొలుత మోసుల్ డ్యాం వద్ద మేస్త్రీ పని పనిచేయించారట. అక్కడ పని చేస్తుండగానే ఇరాకీ బలగాలు జరిపిన కాల్పుల్లో మాజిద్ గాయపడ్డాడు. దీంతో మాజిద్ ను ఉగ్రవాదులు ఆ తర్వాత సిరియా పట్టణం రక్కాకు తరలించారు. అక్కడ ఉగ్రవాదులు అతడికి ఏకే 47 ఆయుధాన్నిచ్చారు. అయితే రెండోసారి కూడా మాజిద్ గాయపడటంతో ఆ ఆయుధాన్ని లాక్కున్న ఉగ్రవాదులు అతనికి మరుగుదొడ్లు కడిగే పనిని అప్పగించారు. ఎన్ఐఏ విచారణలో భాగంగా మాజిదే ఈ వివరాలను వెల్లడించాడు.