: ఆత్మాహుతి దాడులు చేసేలా పక్షులకు శిక్షణ... తాలిబన్ల కొత్త రూటు
ఎంతో మంది ఉగ్రవాదులు ఆత్మాహుతి సభ్యులుగా మారి, తమను తాము బలి చేసుకుని మరెంతో మందిని బలి తీసుకున్న ఘటనలు మనకు తెలుసు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాలిబన్లు సరికొత్త ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని జాతులకు చెందిన పక్షులను ఎన్నుకొని వాటికి చిన్నతనం నుంచే శిక్షణ ఇచ్చి వాటినే ఆత్మాహుతి బాంబర్లుగా ఉపయోగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక పక్షిని కాల్చి చంపడంతో విషయమంతా బయటకు వచ్చింది. బైనాక్యులర్లతో ఫర్యాబ్ రాష్ట్రంలోని తుర్కమెనిస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సైనికాధికారులకు ఎప్పుడూ చూడని ఓ పక్షి కనిపించింది. అలాంటి పక్షులు తమ ప్రాంతంలో కనిపించవన్న అనుమానంతో, మరింతగా పరిశీలిస్తే కొన్ని వైర్లు కనపడ్డాయి. వెంటనే ఆ పక్షిని కాల్చి చంపారు. పక్షికి పేలుడు పదార్థాలతో కూడిన సంచిని, జీపీఎస్ ట్రాకర్ ను, డిటొనేటర్ ను కట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన 'ఆత్మహుతి జాకెట్'ను కూడా తొడిగారు. ఓ చిన్న కెమెరా కూడా ఉంది. దాడి చేసేందుకు సైన్యం దగ్గరకు అంత సులువుగా వెళ్ళలేమన్న కారణంతో, పక్షులనే తమ ఆత్మాహుతి దళంగా తాలిబన్లు మార్చుకున్నట్లు తెలుస్తోంది.