: రోహ్ తక్ సాహస బాలికలకు హర్యానా నగదు పురస్కారం
బస్సులో తమను వేధింపులకు గురి చేసిన పోకిరీలను బెల్టుతో ఉతికి ఆరేసిన రోహ్ తక్ సాహస బాలికలకు హర్యానా ప్రభుత్వం నగదు పురస్కారాలను ప్రకటించింది. తోటి ప్రయాణికులు ప్రేక్షకుల్లా చూస్తున్నా, ఏమాత్రం వెరవని ఆ ఇద్దరు బాలికలు ముగ్గురు పోకిరీలను చీల్చి చెండాడారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బస్సులోని ఓ ప్రయాణికురాలు తీసిన వీడియో క్లిప్పింగ్ ఆదివారం నెట్ లో ప్రత్యక్షమైంది. వీడియోను చూసిన లక్షలాది మంది బాలికల సాహసాన్ని కీర్తిస్తుంటే, హర్యానా సర్కారు ఏకంగా నగదు పురస్కారాలను అందజేసి, వారి సాహసాన్ని గౌరవించింది. ఇద్దరు బాలికలకు రూ.31 వేల చొప్పున నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందజేయగా, ఎట్టకేలకు నిద్ర మేల్కొన్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.