: ఇస్లాం అంటే ఇది కాదు: ఐఎస్ఐఎస్ హింసను ఖండించిన పోప్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు హింసాత్మక చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం నేతలందరూ ముక్తకంఠంతో ఖండించాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఐఎస్ఐఎస్ చర్యలు ఇస్లాంను ప్రతిబింబించేవి కావని స్పష్టం చేశారు. టర్కీ పర్యటన ముగించుకుని రోమ్ వెళుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లింలందరినీ టెర్రరిస్టులు అనలేమని తెలిపారు. ఇస్లామిక్ టెర్రరిజం కారణంగా తమపై మూసధోరణిలో ఉగ్రవాద ముద్ర వేస్తుండడం పట్ల ముస్లింల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. ముస్లిం నేతలందరూ ముందుకొచ్చి ఇస్లాం పేరిట సాగుతున్న మారణకాండకు అడ్డుకట్ట వేయాలని, తద్వారా ముస్లింలలో నెలకొన్న భయాందోళనలను తగ్గించాలని సూచించారు.