: కళాశాలలో కత్తిపోట్లు...విద్యార్థి మృతి
హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో శనివారం కత్తి పోట్ల ఘటన కలకలం రేపింది. సీనియర్లు, జూనియర్ల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈరోజు ఉదయమే ఈ ఘటన చోటుచేసుకున్నా, విద్యార్థి చనిపోయిన తర్వాత కాని ఈ విషయం బయటకు పొక్కలేదు. ప్రేమ వ్యవహారం విషయమై ఈ ఘర్షణ జరిగిందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం సుల్తాన్ బజార్, కోఠి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గొడవలో డిగ్రీ సెకండియర్ విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందగా, అతడి మరణానికి సతీష్ అనే సీనియర్ విద్యార్థి కారణమని ప్రాథమిక సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.