: లొంగుబాటు వెనుక భారీకుట్ర: ఇసిస్ మాజీ ఉగ్రవాదిపై విచారణాధికారుల అనుమానం
ఇసిస్ లో చేరి తిరిగివచ్చిన అరీబ్ మాజిద్ భారీ కుట్రకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. టర్కీ నుంచి తిరిగివచ్చిన అతడిని విచారించిన అధికారులే ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో భారీ దాడికి పాల్పడే క్రమంలోనే అతడు లొంగుబాటు డ్రామా ఆడుతున్నాడని కూడా విచారణాధికారులు అనుమానిస్తున్నారు. ఇసిస్ లో తన అనుభవాలపై అతడు ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని, దీంతో అతడికి ఇసిస్ పై కానీ, ఇసిస్ సిద్ధాంతాలపై కానీ ఏమాత్రం మమకారం తగ్గలేదని వారు అంచనా వేస్తున్నారు. ముంబై శివారులోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన మాజిద్, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇసిస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సిరియా, ఇరాకీ సేనలతో జరిగిన పోరులో అతడు గాయపడ్డాడు. తల్లిదండ్రుల ద్వారా ప్రభుత్వానికి సమాచారం పంపి, లొంగుబాటుకు అతడు మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా ఇసిస్ పై మాజిద్ ఏమాత్రం మమకారం చంపుకున్న దాఖలా కనిపించలేదన్న విచారణాధికారుల వాదన నేపథ్యంలో అతడి వ్యవహారంపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు సాగించనుంది.