: అల్లుళ్ల ఎంపికలో లాలూ రూటు... రైట్ రైట్!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుళ్ల ఎంపికలోనూ తనదైన ప్రత్యేక శైలీనే అనుసరించారు. లాలూ, రబ్రీదేవీలకు మొత్తం తొమ్మిది మంది సంతానం. వీరిలో ఇద్దరు మగ పిల్లలు కాగా మిగిలిన ఏడుగురు ఆడపిల్లలు. జనవరిలో తన ఇంట జరగనున్న పెళ్లి క్రతువుతో ఆడ పిల్లల పెళ్లిళ్లన్నింటినీ ఆయన దిగ్విజయంగా పూర్తి చేసినట్లవుతుంది. ఆ తర్వాత కాని ఆయన అల్లుళ్ల వేట మాని కోడళ్ల వేట మొదలెట్టరట. ఏడుగురు కూతుళ్లలో చిన్న కూతురు రాజలక్ష్మి వివాహం ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ సింగ్ తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. తేజ్ ప్రతాప్, తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి లోక్ సభలో అడుగుపెట్టారు. ఇక మిగిలిన లాలూ ఆరుగురు అల్లుళ్ల విషయానికొస్తే, వారిలో ముగ్గురు రాజకీయ కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. ఇధ్దరు మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఒకరు ఎయిర్ ఇండియా పైలట్ గా పనిచేస్తున్నారు. ఆరో కూతురు అనుష్కను హర్యానా విద్యుత్ శాఖ మాజీ మంత్రి చిరంజీవి రావు కుమారుడికిచ్చి పెళ్లి చేసిన లాలూ, ఐదో కూతురు హేమను ఢిల్లీకి చెందిన రాజకీయ వేత్త వినీత్ యాదవ్ ఇంటికి కోడలిగా పంపారు. ఇక నాలుగో కూతురు రాగిణిని ఘజియాబాద్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర యాదవ్ కుమారుడు రాహుల్ కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడో కుమార్తె చందకు ఎయిర్ ఇండియా పైలట్ విక్రమ్ సింగ్ తో వివాహం జరిపించారు. ఇక మొదటి, రెండో కుమార్తెలు మీనా భారతి, రోహిణి ఆచార్యలను సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు శైలేష్, సమరేశ్ లకు ఇచ్చి వివాహం చేశారు. తొలి ముగ్గురు కుమార్తెలకు రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వరులను తీసుకొచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, వారి తర్వాతి నలుగురు కూతుళ్లకు రాజకీయ నేపథ్యమున్న కుటుంబాల నుంచి వరులను తెచ్చారు. ఇక ఇద్దరు కొడుకులు తేజ్ ప్రతాప్, తేజస్వి ప్రసాద్ యాదవ్ కు ఏ రంగంలోని కుటుంబాల నుంచి కోడళ్లను ఎంపిక చేస్తారో చూడాలి.