: ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన అంశం: రాజ్ నాథ్ సింగ్
దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర చాలా కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఒక సవాలు వంటివని చెప్పారు. ఇక ఉగ్రవాదం చాలా తీవ్రమైన అంశమని, దానిని చిన్నదిగా చూడబోమని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో గౌహతిలో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశానికి ఈ ఉదయం రాజ్ నాథ్ హాజరయ్యారు. ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సరిహద్దులో పాక్ దురాగతాలకు పాల్పడుతోందని, సరిహద్దు ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. 2019 నాటికి అన్ని జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయిందన్న రాజ్ నాథ్, ఇంత ఎక్కువ శాతం పోలింగ్ ఎన్నడూ జరగలేదని వివరించారు.