: తండ్రి పార్టీ 'తమిళమానిల కాంగ్రెస్'ను పునరుద్ధరించిన జీకే వాసన్


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత జీకే వాసన్ తమిళనాడులో నూతన రాజకీయ పక్షాన్ని స్థాపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జీకే మూపనార్ తమిళమానిల కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తమిళమానిల కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించింది. తదనంతర కాలంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాలక్రమంలో తమిళనాట కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరవవడం, కాంగ్రెస్ అధిష్ఠానం తనను నిర్లక్ష్యం చేసి చిదంబరంను అందలాలెక్కించడంపై కినుక వహించిన జీకే మూపనార్ కుమారుడు జీకే వాసన్ తన తండ్రి విలీనం చేసిన పార్టీని ఇప్పుడు పునరుద్ధరించారు. తమిళమానిల కాంగ్రెస్ తమిళుల హక్కులే ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందని పార్టీ ప్రారంభోత్సవంలో జీకే వాసన్ తెలిపారు. కాగా, తమిళనాట రానున్న ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకపోవడం, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం వంటి కారణాలతో, తమిళనాట ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే ఇబ్బందులు ఎదుర్కోనున్నాయని, అలాంటప్పుడు ఇతర పార్టీలు తమ స్థాయి మెరుగుపరుచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీకే వాసన్ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News