: కవల భామలతో డేటింగ్ వికటించింది!


న్యూయార్క్ లో ఓ పెద్దమనిషి వెబ్ సైట్ (సీకింగ్ అరేంజ్ మెంట్.కామ్) ప్రకటన చూసి మోసపోయాడు. 'ఫైండ్ యువర్ షుగర్ బేబీ' అంటూ వృద్ధులకు పడుచులతో డేటింగ్ చేసే సౌకర్యం కల్పిస్తామని ఊరించిందో వెబ్ సైట్. అమ్మాయిలను ఆర్థికంగా ఆదుకుంటే, వారు డేటింగ్ చేస్తారని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనతో పాల్ ఆరోన్సన్ అనే 84 ఏళ్ల సీనియర్ సిటిజెన్ లో ఉత్సాహం రంకెలేసింది. సదరు సైట్ ద్వారా షాయినా ఫోస్టర్ అనే 17 ఏళ్ల ముద్దుగుమ్మను కాంటాక్ట్ చేశాడు. తొలిరోజున ఆమెను డిన్నర్ కు తీసుకెళ్లాడు. ఆ మరుసటిరోజున షాయినా తన కవల సోదరి షలాయినేను కూడా తీసుకొచ్చింది. ఇద్దరిని చూసేసరికి ఆరోన్సన్ ఆనందభరితుడయ్యాడు. కానీ, మరికొన్ని గంటల్లో కథ మారిపోతుందని ఆయన ఊహించలేదు. వారిద్దరినీ తీసుకుని మిడ్ టౌన్లోని ఓ ఖరీదైన రెస్టారెంట్ కు వెళ్లాడు. కడుపునిండా తిన్న తర్వాత, ఆరోన్సన్ ఆ కవల భామలను డ్రింక్ కు ఆహ్వానించాడు. దార్లో రాస్ బెర్రీ ఫ్లేవర్ రమ్ బాటిల్ కొనుక్కుని, తన నాలుగంతస్తుల ఇంటికి వారిని తీసుకెళ్లాడు. అయితే, ఆరోన్సన్ ఆశించినట్టుగా అక్కడ సరస సల్లాపాలు, ముద్దుముచ్చట్లు ఏమీ జరగలేదు సరికదా, అతడిని ఓ టేబుల్ కు కట్టివేశారా కవల కిలాడీలు. అతని వ్యాలెట్ లోంచి రూ.29 వేలతో పాటు, క్రెడిట్ కార్డులు కూడా తీసుకున్నారు. వాటితో దుస్తులు, మేకప్ కిట్లు షాపింగ్ చేశారట. తర్వాత రోజు పొరుగింటాయన వచ్చి చూడగా... కాళ్లు, చేతులు ఓ టేబుల్ కు కట్టివేసిన స్థితిలో ఆరోన్సన్ కనిపించాడు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు జరిపి ఫోస్టర్ సిస్టర్స్ ను అరెస్టు చేశారు. దోషులుగా తేలితే వారికి 15 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయట. అన్నట్టు, ఆ కవల భామల తల్లి లిజా టోరెస్ కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న మనిషేనట. హెరాయిన్ కలిగి ఉన్నందున ఆమెను అరెస్టు చేశారట.

  • Loading...

More Telugu News