: పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుంది: దుర్గ గుడి ఈఓ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ కనకదుర్గ గుడి ఈఓగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్.నర్సింగరావు విధి నిర్వహణకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి రాజీ పడేది లేదని చెప్పిన ఆయన, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దుర్గమ్మ తల్లి ఆలయంలో ఈఓగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ప్రకటించిన ఆయన విధి నిర్వహణలో నిక్కచ్చిగానే ముందుకెళతానని చెప్పారు. ఈ క్రమంలో తన పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో దుర్గ గుడి ఈఓగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దుర్గ గుడి ఆలయంలో రాజకీయ ఒత్తిడులు మరింత పెరిగిన నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.