: మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై మండిపడ్డ టి.ఉద్యోగ సంఘాలు
తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్థాయి నుంచి శాసనమండలి ఛైర్మన్ స్థాయికి ఎదిగిన స్వామిగౌడ్ పై తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ ఉద్యోగుల గృహనిర్మాణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్... ప్లాట్లను అక్రమంగా అమ్ముకుంటున్నారని సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. స్వామిగౌడ్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని మండిపడ్డాయి. అవినీతిని సహించబోనని చెప్పే ముఖ్యమంత్రి... స్వామిగౌడ్ ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని సంఘాల నేతలు ప్రశ్నించారు. స్వామిగౌడ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు కూడా ఆదేశించిందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. గతంలో జరిపిన విచారణలో స్వామిగౌడ్ పై అభియోగాలు నిర్ధారణ అయ్యాయని చెప్పారు. స్వామిగౌడ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.