: బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటీష్ ఎంబసీ వాహనాల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు పౌరులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మరో 30 మందికి పైగా గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. కాబుల్ లో బ్రిటీష్ ఎంబసీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని వివరించారు. మరణించిన వారిలో ఒక బ్రిటన్ పౌరుడు ఉన్నాడని, వాహనం లోపల దౌత్యవేత్తలెవరూ లేరని రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు చెప్పారు. కారులో వేగంగా వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్ మధ్యకు తన వాహనాన్ని తెచ్చి తనను తాను పేల్చుకున్నాడని తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబాన్ వర్గాలు ప్రకటన చేశాయి.