: తెలంగాణ అసెంబ్లీ అరగంట వాయిదా
తెలంగాణ శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి అరగంట పాటు వాయిదా వేశారు. భూ కేటాయింపులపై విచారణకు సంబంధించిన చర్చలో భాగంగా సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. హైదరాబాద్ పరిధిలోని అక్రమాలే కాక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిన భూ కేటాయింపులపైనా తాము విచారణ చేయించేందుకు సిద్ధంగానే ఉన్నామన్న కేసీఆర్ ప్రకటనకు కాంగ్రెస్ ప్రతిస్పందించేందుకు యత్నించింది. అయితే, అప్పటికే ఆ పార్టీ సభ్యులకు పలుమార్లు అవకాశమిచ్చిన స్పీకర్ మరోమారు అవకాశమిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళన నేపథ్యంలోనే స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.