: ఇప్పటికీ ఆ రికార్డు ఫిల్ హ్యూస్ పేరిటే ఉంది!
క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. అతని మరణవార్తతో క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలా జరగడంతో అందరూ ఈ ఉదంతంపైనే చర్చించుకుంటున్నారు. హ్యూస్ అనామక క్రికెటర్ అయితే ఈ స్థాయిలో చర్చ ఉండేది కాదు. కానీ, అతడు ప్రతిభావంతుడు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు సాధించిన పిన్న వయస్కుడు హ్యూసే. అది అతనికి రెండో టెస్టు మాత్రమే. 2009లో దక్షిణాఫ్రికాపై ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించగా, అప్పటికి హ్యూస్ వయసు 20 ఏళ్లే. కెరీర్ లో 26 టెస్టులు ఆడిన హ్యూస్ 32.65 సగటుతో 2866 పరుగులు సాధించాడు. వాటిలో 3 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 25 వన్డేల్లో 1100 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 75.09. వన్డేల్లో 2 సెంచరీలు, 4 ఫిఫ్టీలు నమోదు చేశాడు. ఐపీఎల్ లో ఓసారి ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు కూడా. ఇక, ఆస్ట్రేలియా-ఎ జట్టుకు ఆడుతూ దక్షిణాఫ్రికా-ఎ జట్టుపై 202* పరుగులు చేశాడు. అది వన్డే మ్యాచ్, పైగా హ్యూస్ సాధించింది డబుల్ సెంచరీ కావడంతో అప్పట్లో అతని పేరు మార్మోగిపోయింది. ఆసీస్ లిస్ట్-ఎ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అదే. ఇప్పటికీ ఆ రికార్డు హ్యూస్ పేరిటే ఉంది. ఎడమచేతివాటం బ్యాట్స్ మన్ అయిన హ్యూస్ వాస్తవానికి బౌన్సర్లను ఎదుర్కోవడంలో దిట్ట. కానీ, బంతి గమనాన్ని అంచనా వేయడంలో చిన్న పొరబాటు అతని ప్రాణాలను బలిగొంది. పాతికేళ్ల వయసుకే అతని క్రికెట్ ప్రస్థానం, జీవితం రెండూ విషాదకర పరిస్థితుల్లో ముగిశాయి.