: అది పాత మోడల్ హెల్మెట్... అందుకే హ్యూస్ గాయపడ్డాడు: తయారీదారు
బౌన్సర్ తలకు తగలడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ చావుబతుకుల మధ్య పోరాడుతుండడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు బ్యాట్స్ మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీదారు 'మాసురి' స్పందించింది. హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది. తమ కొత్త మోడల్ హెల్మెట్ ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని అభిప్రాయపడింది. అభివృద్ధి పరిచిన కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్ మెన్ కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని 'మాసురి' వర్గాలు వివరించాయి. బ్రిటన్ కు చెందిన 'మాసురి' క్రికెట్ రక్షణ ఉపకరణాల తయారీలో ప్రసిద్ధిగాంచింది. హ్యూస్ కు తల వెనుక మెడ భాగంలో బలంగా దెబ్బ తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని 'మాసురి' పేర్కొంది. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.