: ప్రతిపక్ష హోదాను అడుక్కోవడం లేదు: వీరప్ప మొయిలీ
లోక్ సభలో ప్రతిపక్ష హోదా కోసం తామేమీ అడుక్కోవడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించిన సవరణపై చర్చ జరిగిన సందర్భంగా మొయిలీ ఈ మేరకు స్పందించారు. ప్రజాస్వామ్యంలో విధానాలను పాటించాలని, ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా నియంతృత్వ ధోరణితో ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదా కోసం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య సుదీర్ఘ కాలం పాటు మాటల యుద్ధం కొనసాగింది. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం సభ్యులున్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చిన నరేంద్ర మోదీ సర్కారు 44 సీట్లున్న కాంగ్రెస్ కు ఆ పదవిని ఇచ్చేందుకు నిరాకరించింది.