: తమిళనాట ఎల్టీటీఈ ప్రభాకరన్ జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు... వైగోను అరెస్ట్ చేసే అవకాశం
శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఉద్యమించి 2009లో లంక సైన్యం చేతిలో హతమైన ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ 60వ జయంతిని ఈరోజు ఘనంగా జరపాలని ఎండీఎంకే నేత వైగో పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ప్రభాకరన్ జన్మ సమయమైన రాత్రి 7:18 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు జరపాలని తన అనుచరులకు తెలిపారు. ప్రభాకరన్ జన్మదిన వేడుకలు జరపడం భారత విధానానికి వ్యతిరేకమని, ఇవి జరగకుండా ఆపాలని పలు రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతికి కారణమైన ప్రభాకరన్ జయంతిని జరపనివ్వకుండా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కోరారు. వైగోపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, వైగోను నేటి మధ్యాహ్నంలోగా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.