: 'హ్యూజెస్' ఘటన అరుదు... కానీ, క్రికెట్ డేంజరస్ గేమ్: లారా
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూజెస్ ఓ బౌన్సర్ ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవడం తెలిసిందే. అతని పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ బ్రయాన్ లారా స్పందించాడు. 'హ్యూజెస్' తరహా ఘటనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయని, కానీ, క్రికెట్ చాలా ప్రమాదకర క్రీడ అని పేర్కొన్నాడు. మంచి గోల్ఫర్ కూడా అయిన లారా ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హ్యూజెస్ కు గాయం దురదృష్టకరమని అన్నాడు. అతని కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని తెలిపాడు. క్రికెట్ లో ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. షెఫీల్డ్ షీల్డ్ దేశవాళీ క్రికెట్ టోర్నీలో, హ్యూజెస్ సౌత్ ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతూ న్యూ సౌత్ వేల్స్ బౌలర్ షాన్ అబాట్ విసిరిన బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బంతి మామూలుగానే తగిలిందని ఫీల్డర్లందరూ భావించినా, హ్యూజెస్ ఉన్నట్టుండి ముందుకు తూలిపడిపోయాడు. దీంతో, అతడిని స్ట్రెచర్ పై తరలించారు. అనంతరం హెలికాప్టర్ లో ఆసుపత్రికి చేర్చారు. తలకు ఆపరేషన్ చేసిన వైద్యులు, ముప్పుపై ఏమీ చెప్పలేమన్నారు.