: ఇలాంటి ఆయా ఉంటే తల్లిదండ్రులు చంపేస్తారు!


భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేకానీ మెరుగైన జీవనం అందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చంటి పిల్లలను చూసుకునేందుకు ఆయాలను పెట్టుకోక తప్పడం లేదు. జీవనోపాధి కోసం ఆయాలుగా కుదురుతున్నవారు పసివారితో వ్యవహరిస్తున్న తీరు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంత మంది తల్లిదండ్రులు ఆయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగాండాలో జాలీ తుముహిర్వే అనే ఆయా పసివాడితో వ్యవహరించిన తీరు పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాలించి, బుజ్జగించి పసిపాపకు ఆహారం అందించాల్సిన ఆయా చిన్న పిల్ల తినకుండా మారాం చేస్తోందని, సోఫాలోంచి కిందికి విసిరేసింది. అప్పటికీ చెప్పిన మాట వినడం లేదని టార్చిలైటుతో కొట్టింది. కసి తీరలేదో ఏమోకానీ కాలుతో తొక్కేసింది. ఇంత జరిగిన తరువాత పసిపాప ఏడవకుండా ఉంటుందా? ఏడుస్తున్న పసిపాపను కాలితో అంతదూరం తన్నేసింది. దీంతో, పాప ఇల్లు ఠారెత్తిపోయేలా ఏడుపులంకించుకుంది. దీంతో, ఇంకా చిరాకు పెంచుకున్న ఆయా అటూ, ఇటూ పాపను తొక్కుకుంటూ నడిచింది. ఇంకా కోపం తగ్గకపోవడంతో మళ్లీ అటూ ఇటూ తొక్కుకుంటూ వెళ్లింది. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో ఆమె నిర్వాకమంతా రికార్డయింది. దీంతో, పసిపాప తల్లిదండ్రులు ఆయాపై హత్యాయత్నం కేసు పెట్టారు. సాధారణంగా తమ పిల్లలను ఎవరైనా ఆయాలు ఇలా చేయడం చూస్తే తల్లిదండ్రులు చంపేస్తారని ఉగాండా కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి మేరీ కరూరో ఓకురుట్ అన్నారు. అయినప్పటికీ సదరు తల్లిదండ్రులు చట్టాన్ని ఆశ్రయించడం అభినందనీయమని ఒకురుట్ ప్రశంసించారు. డిసెంబర్ 8న ఆ ఆయాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News