: బాబులూ... ప్యాకప్: సర్కారీ బంగ్లాల ఖాళీ కోసం మాజీలకు నోటీసులు
‘బాబులూ... మీరు మాజీలుగా మారి చాలా కాలమైంది. ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేసేందుకు మీకిచ్చిన గడువు కూడా ముగిసింది. తక్షణమే బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే’ ఇది దేశ రాజధానిలోని ప్రభుత్వ బంగ్లాల్లో తిష్టవేసిన మాజీ ఎంపీలకు ఢిల్లీ సర్కారు జారీ చేసిన ఆదేశాల సారాంశం. ఈ తరహా నోటీసులందుకున్న వారిలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి భూటా సింగ్ సహా దివంగత నేతలు మాజీ ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ సింగ్ కుటుంబాలున్నాయి. వీరితో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుత్రరత్నం పీవీ ప్రభాకరరావు కూడా ఈ నోటీసులందుకున్నారు. జాతీయ పార్టీ అధినేత హోదాలో లాలూ ప్రసాద్ యాదవ్ తుగ్లక్ రోడ్ లోని విలాసవంతమైన భవంతిలో 2004 నుంచి నివాసముంటున్నారు. దాణా స్కాంలో దోషిగా తేలిన ఆయన చట్టసభ సభ్యుడి హోదాను కోల్పోగా, ఆయన పార్టీ ఆర్జేడీ కూడా జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. అయినా ఆయన మాత్రం పలు కారణాలు చెబుతూ, ఆ భవంతిని మాత్రం ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సర్కారీ బంగళాల కేటాయింపులపై సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో ఇక ఆయన సదరు బంగళా నుంచి బయటకు రాక తప్పడం లేదు.