: విభజన చట్టంలో కొన్ని లోపాలున్నాయి: దత్తాత్రేయ
సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన విభజన చట్టంలో కొన్ని లోపాలున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. విభజన చట్టంలో అనేక లోపాలున్నాయని పలువురు నేతలు, మేధావులు ఇప్పటికే అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలం చేకూర్చినట్టయింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం కూడా సమస్యలు సృష్టిస్తోందని మంత్రి అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాకపోవడానికి ఇది కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. ఇది సమసిపోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారానికి రాకపోతే, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నా సమస్యలు పరిష్కారం కాకపోవచ్చని తెలిపారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులను తాను కలిపిన సంగతి గుర్తు చేశారు.