: ల్యాప్ టాప్ కొనుగోళ్లలో 300 మంది ఢిల్లీ జడ్జీలపై అవినీతి ఆరోపణలు
ఢిల్లీలోని కింది స్థాయి కోర్టుల్లో జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్న 300 మందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2013లో కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల కొనుగోళ్ల విషయంలో వీరంతా అవకతవకలకు పాల్పడ్డారన్న అంశంపై ఢిల్లీ హైకోర్టు నిఘా పెట్టింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయా కోర్టులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులు విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి ఈ కమిటీ దృష్టి సారించనుంది. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ కొనుగోళ్లకు సంబంధించి ఆయా కోర్టులు అందజేసిన బిల్లులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఐపాడ్ ల కొనుగోలు కోసం గతేడాది ఒక్కో కోర్టుకు రూ. 1.10 లక్షలు మంజూరయ్యాయి. కేసుల విచారణలో వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఢిల్లీ హైకోర్టు ఈ నిధులను విడుదల చేసింది. అయితే సదరు పరికరాల కొనుగోలుకు సంబంధించి 300 మంది న్యాయమూర్తులు అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.