: జపాన్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 18 మంది ప్రతినిధుల బృందంతో సీఎం నిన్న రాత్రి 2 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి జపాన్ బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా జపాన్ ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలతో భేటీ కానున్న చంద్రబాబు మొత్తం ఆరు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. వీలయితే జపాన్ ప్రధానితోనూ భేటీ కావాలని ఆయన యత్నిస్తున్నారు. ఈ నెల 29 దాకా కొనసాగనున్న తన పర్యటనలో... వనరులు, పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమన్న విషయాన్ని చంద్రబాబు జపాన్ ప్రభుత్వం, కార్పొరేట్లకు వెల్లడించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో పాటు వీడియోను ప్రదర్శించనున్నారు. ఇక తన ప్రతిపాదనలను ఆంగ్లంలోనే కాక జపనీస్ భాషలోనూ రూపొందించుకున్నారు. జపాన్ ప్రతినిధి బృందాలతో జరుపనున్న సమావేశాల్లో తన ప్రసంగాలను చంద్రబాబు జపనీస్ లోనే మొదలుపెట్టనున్నారు. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడుల సాధన, శ్రీకాకుళం జిల్లాలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం, పెట్టుబడుల సమీకరణ, ఆహారోత్పత్తి రంగం అభివృద్ధి, రాజధానికి మౌలిక సదుపాయాలు, రాజధానికి ఇంధనం, రవాణా, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై ఏపీ, జపాన్ ల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.