: బాలికపై లేడీ టీచర్ లైంగిక దాడి!
బెంగళూరులో తరచుగా చిన్నారులపై అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటుండడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్కూలు సిబ్బందే పిల్లలపై లైంగిక దాడులు చేస్తుండడంపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా, బెంగళూరు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉపాధ్యాయురాలు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తనపై లైంగిక దాడి జరిగిందని బాలిక నిర్ధారించిందని పోలీసులు తెలిపారు. అయితే, ఆ టీచర్ ను చిన్నారి గుర్తించాల్సి ఉందని, అప్పటిదాకా ఆమెను అరెస్టు చేయలేమని పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఈ ఘటన జరిగిందని, నొప్పిగా ఉందని బాలిక ఏడుస్తుండడంతో ఘటన వెలుగులోకి వచ్చిందని ఓ పోలీసు అధికారి వివరించారు. కాగా, ఈ పాఠశాలను ఓ మహిళ నిర్వహిస్తోందని, ఆమె భర్త ఓ బేకరీ యజమాని అని తెలుస్తోంది. దీనిపై, నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ, కేసును నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా ముందుకెళతామని తెలిపారు. కాగా, శనివారం ఉదయం ఆ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.