: ఆ తీర్మానం...ఎన్టీఆర్ ను అవమానపరిచేదే!: చంద్రబాబు


శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును రద్దు చేయాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం ఎన్టీఆర్ ను అవమానపరిచేదేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుయుక్తులు పన్ని సదరు తీర్మానాన్ని చేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఈ రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీ తీర్మానంపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని చెబుతూ, దేశ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తిగా ఎన్టీఆర్ ను ఆయన అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి ఆత్మ గౌరవాన్ని చాటిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజీలేని పోరు సాగించిన ఎన్టీఆర్, తెలుగు నేత పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టే సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి పీవీకి మద్దతు ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి తదితర వ్యక్తులందరికీ రాజకీయ భిక్ష పెట్టింది రామారావేనన్నారు.

  • Loading...

More Telugu News