: నిజంగానే బుర్రను పురుగు తొలిచేస్తోంది!
సాధారణంగా ఎవరైనా అదేపనిగా సతాయిస్తుంటే 'బుర్ర తొలిచేస్తున్నాడ్రా బాబూ' అంటుంటాం. కానీ నిజంగానే ఓ పురుగు మనిషి బుర్రను తొలిచేస్తోందని బ్రిటన్ వైద్యులు చెబుతున్నారు. బ్రిటన్ లో ఓ వ్యక్తి భరించలేని తలనొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతడికి పలు పరీక్షలు చేసిన వైద్యులు అతని తలను స్కాన్ చేసి ఆశ్చర్యపోయారు. అతని బుర్రలో స్పిరోమెట్రా ఎరినాస్యూరోపై అనే పరాన్నజీవి కనిపించింది. దీనిని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. 1953 నుంచి నేటి వరకు కేవలం 300 సార్లు మాత్రమే కనిపించిన ఈ అరుదైన ఏలికపాము, అతని బుర్రలో నాలుగేళ్లుగా కాపురముంటోందిట. దీని కారణంగా అతని శరీర కణజాలాల్లో వాపు వచ్చింది. ఈ లక్షణాన్ని స్పార్గానోసిస్ అంటారని వైద్యులు తెలిపారు. ఇది మెదడులోకి చొరబడ్డాక తలనొప్పి వస్తూ, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని వైద్యులు వెల్లడించారు. సెంటీమీటర్ పొడవున్న ఈ పురుగును గుర్తించి, తీసేసేలోపు అది మెదడులో కుడి నుంచి ఎడమకు ఐదు సెంటీమీటర్ల దూరం ప్రయాణించిందట.