: ఆసీస్ సెలెక్టర్ల 'ముందు' చూపు!
భారత్ తో తొలిటెస్టు (డిసెంబర్ 4-8) ఆడే కంగారూ జట్టును ఆసీస్ సెలక్టర్లు కాస్త ముందుగానే ఎంపిక చేయనున్నారు. వ్యూహాత్మకంగా చూస్తే అది సరైన నిర్ణయం కాకపోయినా, మార్కెటింగ్ ప్రయోజనాల కోసం తప్పడంలేదట. ఆసీస్ సెలెక్టర్ మార్క్ వా ఈ విషయం తెలిపాడు. ఫాక్స్ స్పోర్ట్స్ చానల్లో ప్రసారమైన ఓ క్రికెట్ షోలో ఈ మాజీ క్రికెటర్ మాట్లాడుతూ, తొలి టెస్టు కోసం రెండు వారాల ముందే జట్టును ఎంపిక చేస్తున్నామని వెల్లడించాడు. శనివారం నాడు సెలెక్షన్ కమిటీ సమావేశమై జట్టును ఎంపిక చేస్తుందని తెలిపాడు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పెర్ఫార్మెన్స్ డైరక్టర్ పాట్ హోవార్డ్ మాట్లాడుతూ, మెరుగైన సన్నాహకాల కోసమే జట్టును ఎంతో ముందుగా ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇంతకుముందు ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ కోసం ఇలాగే జట్టును ముందుగానే ఎంపిక చేశారని హోవార్డ్ గుర్తు చేశారు. ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ను 5-0తో చిత్తుచేశామని వివరించారు.