: ముందు నీ కొడుకు పేరు మార్చి, ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి మాట్లాడు: కేసీఆర్ పై పెద్దిరెడ్డి ఫైర్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర నిర్ణయం తెలంగాణలో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని శాసనసభలో కేసీఆర్ అన్నారు. దీనిపై టీటీడీపీ నేత పెద్దిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే అని... అయినా ఎన్టీఆర్ పేరుపై వీరిద్దరూ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టినందుకే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారని పెద్దిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ను అసహ్యించుకుంటున్న కేసీఆర్... ముందు తన కుమారుడి పేరు మార్చి, ఆ తర్వాత మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవమని, దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే, తెలుగువారికి ఎన్టీఆర్ హయాంలోనే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు.