: ఆమ్లెట్ లో టమోటా వేయలేదని చితకబాదాడు!
పెళ్లినాటి ప్రమాణాలు ఆ పెళ్లి తంతు వరకే పరిమితమవుతున్నాయి! నిజజీవితంలో ప్రమాణాల తాలూకు ఆచరణ కరవవుతోంది. భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానన్నవాడే చిత్రహింసలు పెడుతున్నాడు! మధ్యప్రదేశ్ లోని మోవు గ్రామంలో ఓ భర్త మహాశయుడు ఆమ్లెట్ లో టమోటా వేయలేదని భార్యను చితకబాదాడు. పాపం, ఆమె గర్భవతట! కనీసం, ఆ ఇంగితం కూడా లేకుండా చేయిచేసుకున్నాడు. గాయాలపాలైన ఆ అభాగ్యురాలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫర్జానా అనే ఈ అబలకు షఫిక్ తో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారట. ఆ గొడవల మధ్యే ఈ ఆమ్లెట్ రగడ చోటుచేసుకుంది. భర్త తనను కొట్టాడంటూ ఫర్జానా ఖర్గోన్ లో ఉన్న తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. వారు వెంటనే మోవు గ్రామానికి వచ్చి కుమార్తెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు షఫీక్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు.