: ఆయనకు పాలతో స్నానం చేయించి, ఆ పాలతో పాయసం చేస్తారట... బాబా రాంపాల్ లీలలు!


హర్యానాలోని హిస్సార్ లో బాబా రాంపాల్ ఆశ్రమంలో అల్లర్లు చెలరేగి ఆరుగురు మరణించడం తెలిసిందే. దాంతో, పోలీసులు బాబాను అరెస్టు చేశారు. అనంతరం ఆయన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన దర్జా వెలగబెట్టిన విధానం, ప్రజలను భక్తి ముసుగులో వంచించిన వైనం అన్నీ బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అనుచరులు బాబాకు పాలతో స్నానం (అభిషేకం) చేయిస్తారట.... ఆ పాలతో పాయసం చేసి ప్రసాదంలా అందరికీ పంచిపెడతారట. మనోజ్ అనే భక్త పుంగవుడు చెప్పిన విషయం ఇది! అయితే, క్రిషన్ అనే మరో భక్తుడు మనోజ్ తో విభేదించాడు. అభిషేకం చేసిన పాలతో పాయసం చేయరని, అయితే, బాబా ధ్యానం చేస్తున్నప్పుడు సీలింగ్ నుంచి పాలు ధారలా ఆయనపై పడుతుంటాయని తెలిపాడు. ఆయన ధ్యానఫలం కాస్తా వేరే పాలతో వండిన పాయసాన్ని ఆవహిస్తుందట. అదే మహాప్రసాదం అనుకుని భక్తులు కళ్లకు అద్దుకుని మరీ తింటారట. అన్నట్టు... ఆశ్రమంలో జరిగిన అల్లర్లలో క్రిషన్ భక్త మహాశయుడి తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News