: మోదీ సర్కారు నల్లధనాన్ని పెంచుతోంది: చిదంబరం
కిసాన్ వికాస పత్రాలను ('కేవీపీ') మరోసారి జారీ చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం నల్లధనాన్ని పెంచేందుకు కంకణం కట్టుకుందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. బ్యాంకులు కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలు పాటించకుండా పెట్టుబడులు తీసుకుంటే నల్లధనాన్ని పెంచినట్టేనని ఆయన అన్నారు. ఈ పత్రాలను కొనుగోలు చేసిన వారి వివరాలు తీసుకున్నంత మాత్రాన సరిపోదని ఆయన వివరించారు. కిసాన్ వికాస పత్రాలను కొని ఆపై వేరే వ్యక్తులకు బదలీ చేస్తే పరిస్థితి ఏంటని చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతో, దాచి ఉంచిన నల్లధనం చలామణిలోకి వస్తుందని హెచ్చరించారు. కాగా, 'కేవీపీ'ల అమ్మకం ద్వారా మార్చి 2016 నాటికి 35 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.