: తెలంగాణ ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి... ప్రభుత్వ విధానాల ఫలితం!
తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో అనుసరిస్తున్న విధానాలతో విసిగి వేసారిన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, జానారెడ్డి, లక్ష్మణ్ సమావేశమయ్యారు. అంతకుముందు, తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సభను న్యాయబద్ధంగా, సజావుగా నడిపించాలని, ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు కూడా కల్పించాలని, అది వారి హక్కు అని సూచించారు. సభాపతి అంటే అన్ని పార్టీలకు ప్రతినిధిలాంటి వ్యక్తి అని, పార్టీలకతీతంగా సభాపతి వ్యవహరించాలని వారు కోరారు. అనంతరం, తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి, టీకాంగ్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత లక్ష్మణ్ సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీలుగా ప్రభుత్వాన్ని నిలదీస్తే పట్టించుకునే నాథుడు లేడని, తామంతా ఏకమై ప్రభుత్వాన్ని నిలదీస్తే ఫలితముంటుందని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం.