: మూడున్నర నెలల ముందే పుట్టినా.. క్షేమంగానేఉంది!
తొమ్మిదినెలల పాటూ గర్భంలో ఉండవలసిన పసికందు, తల్లికి ఉన్న చిన్న అనారోగ్య సమస్య వలన.. మూడున్నర నెలల ముందే ప్రసవం అయిపోయినప్పటికీ.. డాక్టర్లు సరైన చికిత్సలు అందించడంతో అసాధ్యమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని.. ప్రాణాలతో మనగలిగింది. ఢిల్లీలోని శ్రీబాలాజి యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. పింకీ చౌదరి అనే 29 ఏళ్ల మహిళకు పదేళ్ల కిందట గర్భస్రావం అయింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు గర్భం దాల్చిన ఆమెను.. 23వ వారంలోనే ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకువచ్చారు. మనదేశంలో ప్రసవానికి ఉండవలసిన గడువు కనీసం 27 వారాలు కాగా, బిడ్డ కనీసం 700 గ్రాములు ఉండాలి. ఈ బిడ్డ బతకడానికి అసాధ్యమైన పరిస్థితుల్లో ఆస్పత్రికి తేబడినప్పటికీ.. డాక్టర్లు సవాలుగా తీసుకుని చికిత్స అందించారు. నార్మల్ డెలివరీనే అయినప్పటికీ.. బిడ్డ కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే ఉన్నది. మూడున్నర నెలలు ముందే పుట్టిన ఈ బిడ్డను ప్రత్యేకమైన నాయోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 12 వారాల పాటు ఉంచారు. ప్రస్తుతం ఆమె బాగానే కోలుకున్నదని.. అపాయం నుంచి బయటపడ్డట్లేనని ఇది ఒక వైద్యపరమైన అద్భుతమని డాక్టర్లు చెప్పారు.