: చేతివాటం ప్రదర్శించి జైలుపాలైన టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్
టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దగ్గుబాటి ప్రకాశ్ (38) చేతివాటం ప్రదర్శించి జైలుపాలయ్యాడు. వివరాల్లోకెళితే... అక్టోబర్ 22న ప్రకాశ్ షాపింగ్ నిమిత్తం బేగంబజార్ వెళ్లాడు. అక్కడ ఓ పూజాసామాగ్రి షాపులో ప్రవేశించిన ప్రకాశ్, కౌంటర్లో ఉన్న నగదు బ్యాగ్ దొంగిలించాడు. దీనిపై దుకాణ యజమాని ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ప్రకాశ్ ఈ దొంగతనం చేసినట్టు తేలింది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.1,79,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రకాశ్ గుంటూరు జిల్లాకు చెందినవాడు. టీవీ సీరియళ్లకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానూ, స్క్రిప్ట్ రైటర్ గానూ పనిచేస్తున్నాడు.