: ఇంత మంది ఎందుకొచ్చారు?: 2జీ కేసులో సీబీఐకి సుప్రీం చీవాట్లు
"ఒక్క కేసు విచారణకు ఇంత మందెందుకు వచ్చారు? సమయం వృథా చేయడం మాని పనిచేసుకోండి" అంటూ సీబీఐకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. 2జీ కేసులో భాగంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని సీబీఐ డైరెక్టర్ కలిశారని, నిబంధనలను ఉల్లంఘించిన ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలనీ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై గురువారం జరిగిన విచారణకు సీబీఐ తరఫున పలువురు అధికారులు హాజరయ్యారు. విచారణ సందర్భంగా వీరిని చూసిన సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, ఒక్క కేసు విచారణకు ఇంత మంది ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగని ఆయన ‘మీరు సీబీఐ అధికారులా? లేక, సీబీఐ డైరెక్టర్ ఏజెంట్లా?’ అని కూడా వారిని నిలదీశారు. దీంతో కేసు విచారణకు హాజరైన సీబీఐ అధికారులకు నోట మాట రాలేదు. న్యాయమూర్తి మందలింపుతో ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు.