: నల్లధనంపై భారత్ వద్దనున్న సమాచారం ఒక్క శాతమే: హెచ్ఎస్ బీసీ మాజీ ఉద్యోగి
నల్లధనంపై మోదీ సర్కారు చేస్తున్న భారీ ప్రచారం ఊకదంపుడు ఉపన్యాసమేనా? అవుననే అంటున్నారు హెచ్ఎస్ బీసీ మాజీ ఉద్యోగి, ఫ్రాన్స్ దేశస్థుడు హెర్వ్ ఫాల్సియాని. నల్లధనం సమాచారానికి సంబంధించి భారత్ వద్ద ఉన్న సమాచారం ఒక్కశాతం మాత్రమేనని ఆయన ప్రకటించారు. దేశీయ వార్తా ఛానెల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ బాంబు పేల్చాడు. హెచ్ఎస్ బీసీ లో ఉద్యోగం మానేస్తున్న సందర్భంగా సదరు బ్యాంకులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, వ్యాపారులు రహస్యంగా నిర్వహిస్తున్న పలు ఖాతాల సమాచారాన్ని ఆయన తన వెంట తీసుకొచ్చారు. ఇందులో భారత్ కు చెందిన 600 ఖాతాలున్నాయి. "నల్లధనానికి సంబంధించి భారత్ వద్ద ఉన్న సమాచారం కంటే నా వద్ద వెయ్యి రెట్ల సమాచారం ఉంది. ఇతర దేశాలకు సహకరిస్తున్న మాదిరిగానే భారత్ కు సహకరించేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను" అని ఫాల్సియాని ప్రకటించారు. మరి ఆయన వద్ద ఉన్న సమాచారం కూడా అందితే దేశంలో మరెంత మంది నల్ల కుబేరులు బయటకొస్తారో!