: మోదీ కో మర్ దో... ఆగంతుకుడి ఎస్ఎంఎస్: హైరానాలో జార్ఖండ్ పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీని చంపేయండంటూ జార్ఖండ్ లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి వచ్చిన సందేశం ఆ రాష్ట్ర పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాంచీకి చెందిన అమరేశ్ కుమార్ మొబైల్ కు ‘మోదీ కో మర్ దో’ అంటూ ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది. దానిని చూసి హడలిపోయిన అమరేశ్, వెనువెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ఆ సందేశం వచ్చిన మొబైల్ ఎవరిది, సదరు వ్యక్తి ఎక్కడున్నాడన్న వివరాలపై ఆరా తీయడం మొదలెట్టారు. మోదీ పర్యటనలో ఏ చిన్న పొరపాటు కూడా జరగరాదన్న భావనతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.