: ప్రవాస భారత విద్యార్థినికి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి
అమెరికాకు చెందిన పద్దెనిమిదేళ్ళ ప్రవాస భారత విద్యార్థిని నేహా గుప్తా ఈ ఏడాది అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపికైంది. భారత్ లోని అనాథ పిల్లల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నేహా గుప్తాకు ఈ అవార్డు దక్కింది. మంగళవారం హేగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి విజేత డెస్మండ్ టూటూ ఈ అవార్డును నేహాకు అందజేశారు. తొమ్మిదేళ్ల వయసులోనే భారత్ లోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత నేహా అనాథ పిల్లల కోసం ‘ఎంపవర్ ఆర్ఫాన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా వేలాది మంది అనాథలకు ఈ సంస్థ చేయూతనందించింది. కాగా, గతేడాది ఈ అవార్డును పాక్ బాలికల విద్యా హక్కు ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్ అందుకుంది.