: నోకియా మళ్లీ వస్తోంది!
మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు విక్రయించిన నోకియా మళ్లీ తెరపైకి వచ్చింది. సొంత బ్రాండ్ నేమ్ తో ఎన్1 ట్యాబ్లెట్ ను తీసుకువస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్ ఫోన్లపై నోకియా పేరు తొలగించిన కొద్ది వారాలకే ఈ ఫిన్ లాండ్ దిగ్గజం తాజా ప్రొడక్ట్ తో ఉనికిని చాటుకునేందుకు సిద్ధమైంది. 7.9 అంగుళాల తెర కలిగిన నోకియా ఎన్1 చూసేందుకు యాపిల్ ఐపాడ్ ఎయిర్ మాదిరే కనిపిస్తుంది. స్క్రీన్ కు గొరిల్లా గ్లాస్ రక్షణ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఓఎస్ పై కూడా ఇది పనిచేస్తుంది. అయితే, నోకియా జెడ్ లాంచర్ ప్రధాన ఆపరేటింగ్ సిస్టం. 2.3 గిగాహెర్ట్జ్ ఇంటెల్ 64 బిట్ ఆటమ్ జెడ్ 3580 ప్రాసెసర్ తో పనిచేసే ఎన్1 ట్యాబ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజి కెపాసిటీ కలిగి ఉంటుంది. 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీని ప్రత్యేకతలు. తొలుత ఈ ట్యాట్ ను చైనాలో ప్రవేశపెట్టాలని నోకియా భావిస్తోంది. చైనాలో దీనిని 249 డాలర్ల (రూ.15677)కు విక్రయించాలని భావిస్తున్నారు. అటుపై, రష్యాలో లాంచ్ చేయడం ద్వారా యూరప్ మార్కెట్లోనూ ఎన్1ను ప్రవేశపెట్టాలని నోకియా వర్గాలు యోచిస్తున్నాయి.