: విదేశాల్లో మోదీకి ప్రజాదరణ చూసి కాంగ్రెస్ నిర్ఘాంతపోతోంది: అరుణ్ జైట్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విదేశాల్లో వస్తున్న పాప్యులారిటీకి కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపోతోందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మయన్మార్ పర్యటనలో హాజరైన వారంతా భారత్ నుంచి తీసుకెళ్లినవారేనని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అంతకుముందు రోజు వ్యాఖ్యానించారు. అందుకు తిరుగు విమర్శగానే జైట్లీ పైవిధంగా తన బ్లాగ్ లో రాశారు. "సల్మాన్ ఖుర్షీద్ ఓ అద్భుతమైన వాదన చేస్తున్నారు. ఆయన మయన్మార్ వెళ్లినప్పుడు కలిసేందుకు ఎవరూ రాలేదు. అందుకే, మోదీ తను వెళ్లే ప్రతి విదేశీ పర్యటనకు గుంపులు గుంపుల జనాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. యూపీఏ నేతలు తమ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు అక్కడి వారిని ఏ కోశానా పట్టించుకోలేదు. సిడ్నీలో మోదీకి వచ్చిన పాప్యులారిటీని చూసి సల్మాన్, కాంగ్రెస్ పార్టీ నేతలు పడుతున్న మనోవేదనను నేను అర్థం చేసుకోగలను" అని జైట్లీ పేర్కొన్నారు.