: విశాఖను ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దుదాం: ఏపీ సీఎం చంద్రబాబు
విశాఖను అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో నగరాన్ని సుందరంగా, ఆధునిక నగరంగా మార్చే బాధ్యత తనదేనని చెప్పారు. అటు విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర నీతి నిజాయతీలకు మారుపేరని, వనరులు ఉపయోగించుకుని అభివృద్ధికి బాటలు వేద్దామని బాబు సూచించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు, ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ప్రసంగిస్తూ, సమస్యలను ఎదుర్కోవడంలో విశాఖ ప్రజలది ఉక్కు సంకల్పమని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల సహకారం తన జీవితంలో మర్చిపోనన్నారు. ముప్పై ఐదు రోజుల్లో చాలావరకు సమస్యలు అధిగమించగలిగామని, కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.