: సీఎం అభద్రతాభావంలో ఉన్నారు...అందుకే వలసలను ప్రోత్సహిస్తున్నారు: జీవన్ రెడ్డి
తెలంగాణ సీఎం అభద్రతా భావంలో ఉన్నారని, ఆ క్రమంలోనే ఆయన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించకుండా ప్రభుత్వం తమపై దాడికి దిగేలా వ్యవహరిస్తోందని అసెంబ్లీ రెండోసారి వాయిదా పడ్డ అనంతరం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వ వ్యవహారంపై జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. విపక్షాలపై దాడి చేసే రీతిగానే అధికార పక్షం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పూర్తి మెజారిటీ సాధించినా, కేసీఆర్ లో అభద్రతా భావం పోలేదని, అందుకే ఆయన వలసలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సభలో అధికార పక్షం తీరు మారకపోతే హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రకటించారు.